హైదరాబాద్‌కు తెలుగుపండుగొచ్చింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు జరిగే హెచ్‌ఐసీసీ నోవాటెల్‌  లో వేదిక సిద్ధమైంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ మహాసభల కోసం హైదరాబాద్‌ అంతటా ప్రచారం కూడా బాగా జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని సంఘటిత పరచి, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ విలువలను, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపోషిస్తూ నేటితరం మరియు భావితరాలకు అందించడానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పలు సాహిత్య ఇతర రంగాల అంశాలపై సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలను ప్రపంచ తెలుగు సమాఖ్య ... 12వ మహాసభలను వైభవంగా నిర్వహించనుంది. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసభలకు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది తెలుగు ప్రముఖులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. రాజకీయ నాయకులు, సినీకళాకారులు, సాహితీ వేత్తలు, వ్యాపార ప్రముఖులు, ఇతర రంగాలకు చెందినవారు కూడా ఈ వేడుకల్లో పాల్గొన నున్నారు. 3వ తేదీన జరిగే ప్రారంభ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  హాజరుకానున్నారు. జనవరి 5వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వస్తున్నారని ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్‌ తెలిపారు.

ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్తలను, ఇతర రంగాలకు చెందిన కొందరు తెలుగు ప్రముఖులను కూడా ఆహ్వానించి సత్కరించనున్నారు. ఈ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జానపద కళారూపాల ప్రదర్శన, కూచిపూడి నృత్య రూపకాలు, సాహితీ రూపకములు, భాషా, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, సినీ కళాకారుల ప్రదర్శనలు, సినీసంగీత విభావరి, తెలుగువారి చేనేత వస్త్ర అందాల ప్రదర్శనలతో పాటు మరికొన్ని ఆసక్తికర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. యునికార్న్‌ కంపెనీలు స్టార్టప్‌ కంపెనీలు కూడా ఇందులో పాల్గొననున్నాయి. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్నట్లుగా నిర్వాహకులు చెప్పారు.

Related Videos