అమరావతిని ధ్వంసం చేయడానికి జగన్ ప్రభుత్వం అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు చేస్తోంది. భూములు ఇచ్చిన రైతులకు కేటాయించాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో ప్రభుత్వం అష్టకష్టాలు పెడుతోంది. నిబంధనలను తనకు అనుకూలంగా మార్చుకొని అమరావతిపై మరో కుట్రకు తెరలేపింది. రైతుల ఆమోదం అవసరం లేకుండానే వారికి బలవంతంగా ప్రత్యామ్నాయ ప్లాట్లను అంటగట్టేందుకు రంగం సిద్ధం చేసింది.  ఎన్నికల ప్రకటన వచ్చేలోగా భూసేకరణ భూముల్లోని ప్లాట్లను రద్దు చేసేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఇంకా సమ్మతి తెలపని రైతులకు వారి అంగీకారంతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించేందుకు వీలుగా కసరత్తు పూర్తి చేసింది. రైతుకు రిటర్నబుల్ ప్లాట్ కానీ ప్రత్యామ్నాయ ప్లాట్ కానీ కేటాయించాలంటే ముందుగా ముసాయిదా లేఅవుట్ ప్రణాళిక సిద్ధం చేసుకుని ...దానిపై సూచనలు అభ్యంతరాలని తీసుకోవాలి. అభ్యంతరాలు ఉంటే నిబంధనలకు లోబడి వాటిని పరిష్కరించి తుది లేఅవుట్ ను సీఆర్డీఏ కమిషనర్ ఆమోదంతో సిద్ధం చేయాలి. తర్వాతే లాటరీ తీసి ప్లాట్లను కేటాయించాలి. ఈ నిబంధనలన్నీ మార్చి ప్రక్రియను వేగంగా ముగించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రైతుల ఆమోదం లేకుండా ప్లాట్ల కేటాయింపు అంశంపై పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి ఇటీవల న్యాయ సలహా కోరారు. ప్రభుత్వం ఆశించిన విధంగానే హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నుంచి సలహా వచ్చింది. ఆ తర్వాత సీఎం జగన్ అధ్యక్షతన సిఆర్డిఏ అథారిటీ సమావేశాన్ని ఈ నెల 11న నిర్వహించారు. ఇందులో ఎజెండా నంబర్ 452 ద్వారా రైతుల సమ్మతి లేకుండానే ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించేందుకు ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయింది. కొత్త నిబంధన ప్రకారం ఇక మిగిలిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను అంటగట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే రైతుల ప్రయోజనాలు దెబ్బ  తినడంతో పాటు అమరావతి మాస్టర్ ప్లాన్ కు తీవ్ర విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది.  భూసేకరణలోని ప్రాంతాల్లో కేటాయించిన ప్లాట్లను మార్చి వేరొక చోట ఇచ్చేందుకు సీఆర్డీఏ ఇటీవల సంబంధిత రైతులకు నోటీసులు జారీ చేసింది. వీటికి సమ్మతి తెలిపిన రైతులకు రెండు దశల్లో ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ-లాటరీ ద్వారా కేటాయించింది. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి లాటరీ తీసి ప్లాట్లను కేటాయించడం వల్ల రైతుల హక్కులకు భంగం వాటిల్లుతుంది. అత్యధికంగా వీధి పోటు ప్లాట్లు రావడానికి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే రెండుసార్లు తీసిన లాటరీలో 30 శాతం పైగా ఈ రకమైనవే కావడం గమనార్హం. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక భూసేకరణ ప్రకటన ఉపసంహరించాలని ప్రభుత్వ ఎత్తుగడ. భూసేకరణ లో ఉన్న భూముల్ని తిరిగి రైతులకు ఇచ్చేయడం వల్ల సమస్య మొదటికి వస్తుంది. దీనిని పరిష్కరించడం వచ్చే ప్రభుత్వానికి కష్టమవుతుంది. ఇలా అమరావతి మాస్టర్ ప్లాన్ ను విచ్చిన్నం చేసే కుట్రకు వైసీపీ సర్కార్  తెరదీసింది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos