సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీల సంబరం మొదలు కానుంది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ - ఆర్‌ఎస్ సీఏ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుండి 16వ తేదీ వరకు 30వ అంతర్‌రాష్ట్ర టీ–20 క్రికెట్ పోటీలు ప్రారంభించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరావు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గత 30 ఏళ్ల నుంచి క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నామని... అయితే కరోనా మహమ్మారితో గడచిన మూడేళ్లుగా పోటీలను నిలిపివేశామని, తిరిగి ఈ ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే జట్లకు వసతి సౌకర్యంతో పాటు ఇంటి వాతావరణంలో ఏర్పాటు చేసిన భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీభమర సంక్రాంతి కప్ 2024, 30వ టీ20 అంతర్‌రాష్ట్ర క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని... నాకౌట్ కం లీగ్ ప ద్ధతిలో జరిగే ఈ పోటీల్లో 16 జట్లు పాల్గొంటాయన్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రా ష్ట్రాల నుంచి జట్లు పోటీలలో పాల్గొంటున్నాయి. మొదటి బహుమతిగా రూ.3లక్షలు, రెండో బహుమతిగా రూ.2 లక్షలు, మూడో బహుమతిగా రూ.లక్ష అందిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. M మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, బెస్ట్ బ్యాట్స్‌మెన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్, ప్రతి పోటీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు ఇవ్వనున్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా అఖిల భారత బ్యాడ్మింటన్ కార్యదర్శి కరణం పున్నయ్య చౌదరి, ప్రముఖ సినీనటుడు యర్రా రఘుబాబు, శ్రీభమర టౌన్‌షిప్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా రామచంద్రరావు, డాక్టర్ బి.జవహర్, ప్రముఖ న్యాయవాది మోహన్‌దాస్ హాజరవుతారు. రావినూతల గ్రామస్థులకు సంక్రాంతి కప్ కిక్రెట్ పోటీలు ఎంతో ఇష్టమైనవి. దేశ విదేశాలలో ఎ క్కడ ఉన్నా సంక్రాంతి పండుగకు గ్రామానికి రావడం, క్రికెట్ పోటీలను వీక్షించడం ఆనవాయితీ. ఇక్కడకు వచ్చే క్రీడాకారులు కూడా పండుగకు తమ గ్రామానికి వెళ్తున్నట్లే భావిస్తారు. అంతర్జాతీయ క్రీడాకారులు అయిన వేణుగోపాలరావు, వెంకటపతిరాజు, టీం ఇండియా మాజీ సెలెక్టర్ ఎంఎస్ కే ప్రసాద్, నోయల్ డేవిడ్, రంజీ, ఐపీఎల్ పోటీలలో పాల్గొంటున్న ఎంతో మంది క్రీడాకారులు ఇక్కడ పోటీలలో పాల్గొన్నవారే. పోటీలలో పాల్గొనే పదహారు జట్లకు గతంలో ఎంతో వ్యయప్రయాసల కోర్చి ఎక్కడెక్కడో బస ఏర్పాటు చేసేవారు. పెవిలియన్ భవనం పూర్తి అయిన తరువాత క్రీడాకారులందరికీ స్టేడియంలోనే బస ఏర్పాటుచేశారు. గత 30 యేళ్లు గా ఇక్కడ పోటీలలో పాల్గొనే ఆటగాళ్లకు ఉచిత వసతి, భోజనం, ఆర్‌ఎస్ సీఏ వాళ్లే ఏర్పాటు చేస్తున్నారు. గ్రామం లోని నలుగురు యువకులు కారుసాల నాగేశ్వరరావు, ప్రతాప్, పుట్టా వెంకటరావు, వీరాంజనేయులు కు వచ్చిన ఆలోచన ఊరికి ఇంతటి పేరు తెస్తుందని ఊహించలేదు. క్రికెట్ పోటీలు ప్రారంభించాలనే తమ ఆలోచనను గ్రామం లోని స్నేహితులతో పంచుకున్నారు. గ్రామం లో క్రీడా మైదానం లేక పోవడంతో ... బీడు భూములను బాగు చేసి 1990 లో రూ. 1116 ప్రైజ్ మనీ తో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలకు శ్రీకారం చుట్టారు. దీనికి మంచి స్పందన రావడంతో తరువాత యేడాది నుంచి 4 జిల్లాల స్థాయి పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత 1992 లో రావినూతల స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ పురుడు పోసుకుంది. 1993 లో మైదానానికి రెండు వైపులా నైట్ స్క్రీన్ లు ఏర్పాటు చేసి ... మైదానాన్ని రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధం చేశారు. టోర్నీ ప్రథమ బహుమతిని రూ. 10 వేలకు పెంచారు. అనంతర కాలంలో ఆర్ ఎస్ సీ ఏ సభ్యుల సంఖ్య పెరిగి... వటుడు ఇంతయి.. ఇంతింతై అన్నట్లుగా రాష్ట్ర స్థాయిలో ఈ అసోసియేషన్ పేరు మార్మోగిపోతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos