ఏపీలో మరో కూటమి ఏర్పాటు కాబోతోంది. కాంగ్రెస్ సారథ్యంలో కేంద్రంలో ఏర్పాటైన ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిపి కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూటమిగా ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ప్రకటించారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధమయ్యామని, భవిష్యత్‌లో కలిసి పోటీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని అధికార వైసీపీని గద్దె దించాలంటే బలంగా ఉండాలని, అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నామని ఆమె స్పష్టం చేశారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, శ్రీనివాసరావుతో కలిసి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సీపీఎం, సీపీఐ పార్టీలతో కలిసి ప్రభుత్వంపై పోరాటాన్ని సాగిస్తామన్నారు. రాష్ట్రంలో టిడిపి, వైసీపీ.. కేంద్రంలోని బీజేపీకి బీ టీమ్‌లుగా ఉన్నాయని, కాబట్టి తామంతా కలిసి కట్టుగా పోరాటం చేయకపోతే పెద్ద పర్వతాలను దించడం అసాధ్యమన్నారు. రెండు పార్టీలతో కలిసే భవిష్యత్‌లో కార్యక్రమాలను నిర్వహిస్తామని షర్మిల వెల్లడించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ఈ నెల 26న ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వ్యంలో అనంతపురంలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారన్నారు. ఈ సభకు సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా హాజరుకావాలని ఈ సందర్భంగా షర్మిల ఇరువురు నేతలను ఆహ్వానించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో కలిసి కట్టుగా ఒకో ఫోర్స్‌లా తయారు కావాలని నిర్ణయించామన్నారు. కాగా షర్మిల చేస్తున్న ఈ పోరాటం కాంగ్రెస్ పార్టీకి లబ్ధి సంగతేమో కానీమో గానీ ..ఇతర పార్టీలకు ఏ మేరకు లాభనష్టాలు చేకూరుస్తుందోనని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos