ఏపీలో జగన్ సర్కారు ఏ వర్గం వారితోనైనా సరే చెలగాటమాటమాడుతూ ... వారిని సర్వవిధాలా ఇబ్బందులకు గురిచేయడం పరిపాటి అయింది. ఈ క్రమంలో దశాబ్దాల తరబడి నేలతల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతులను, రైతుకూలీలను కూడా సీఎం జగన్ వదిలిపెట్టడం లేదు. పల్లెల్లో వంశపారంపర్యంగా వస్తున్న భూములతోనైనా... కష్టపడి సంపాదించిన భూమితోనైనా ఎలాంటి రైతుకైనా అనిర్వచనీయమైన అనుబంధం ఉంటుంది. సెంటు తేడా వచ్చినా విలవిల్లాడిపోతారు. ఈ క్రమంలో... భూముల రీ-సర్వేతో భూసమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ ముందుకొచ్చింది జగన్ ప్రభుత్వం. అమాయక రైతులు పాపం... ఇది నిజమే కాబోలు అని నమ్మారు. తీరా... రీ-సర్వే తర్వాత వారు లబోదిబోమంటున్నారు. ఈ రీ సర్వేలో ఉన్న తప్పులు సరిదిద్దటం అటుంచి ... కొత్త పట్టాదారు పుస్తకాల్లో తప్పుల్ని చూసి... పెనంలోంచి పొయ్యిలో పడ్డామని వాపోతున్నారు అన్నదాతలుభూ వివాదాల పరిష్కారానికంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన 'శాశ్వత హక్కు - భూరక్ష పథకం' మరింత గందరగోళానికీ ... కొత్త భూ వివాదాల సృష్టికి కారణమవుతోంది. పారదర్శకంగా రీ-సర్వే నిర్వహించి, వివాదాలకు దూరంగా రికార్డుల్లో వివరాలు నమోదు చేసి, కచ్చిత కొలతలూ, వివరాలతో పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్ చేసే ఆర్భాట ప్రచారానికి.. క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదు. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు అందజేసిన పుస్తకాలు అన్నీ తప్పులు తడకలతో ఉంటున్నాయి. కొత్త పుస్తకాల్లో రైతుల ఫొటోలు మారాయి. చనిపోయిన వారి పేర్లు యథాతథంగా ఉంటున్నాయి. భూ విస్తీర్ణం, సర్వే, నంబర్లు, భూమి స్వరూపం, ఇతర వివరాల నమోదులోనూ భారీగా తప్పులు దొర్లాయి. దాదాపు అన్ని గ్రామాల్లోనూ రీ-సర్వే ప్రహసనంగా జరిగింది. వివాదాలు పరిష్కరించకుండానే.. చనిపోయిన వారి పేర్లను తొలగించకుండానే... కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందించడంతో ... తమకు అన్యాయం జరిగిందంటూ అన్నదాతలు గొల్లు మంటున్నారు. పుస్తకాల్లో తప్పులు దొర్లడం వల్ల సరిహద్దు రాళ్లు పాతడంలోనూ సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల రీ-సర్వే స్ఫూర్తికే విఘాతం ఏర్పడుతోంది. అసలుకే ఉన్న భూమి రీ-సర్వేలో కొంత తగ్గిందని ఆవేదనలో ఉన్న రైతులను పట్టాదారు పాసు పుస్తకాల్లో దొర్లుతున్న తప్పులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాసు పుస్తకాల, రికార్డుల ప్రక్షాళన ఏం జరిగినట్లు... మాకేం న్యాయం చేసినట్లు అని రైతులు నిలదీస్తున్నారు. అన్ని వ్యవస్థల్లోనూ తప్పులు తడకలుగా పాలన సాగిస్తున్న ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి మళ్లీ ఓటు వేసి మా జీవితాలను నరకప్రాయం చేసుకోవాలా అని రైతులు నిలదీస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos