ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో టీడీపీ ప్రచారజోరు పెంచేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిన్న బెంగళూరు నగరంలో పార్టీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత కుప్పం చేరుకుని... మూడు రోజుల పర్యటనను ప్రారంభించారు. నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం బిసానత్తం గ్రామంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గుడుపల్లె బస్టాండులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ... ఇక వైసీపీ సినిమా అయిపోయిందని... ఈలోపు యువత ఇంట్లో ఉండొద్దని... మీకోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ వంద రోజులు కష్టపడండని పిలుపునిచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసే అవినీతిని, రౌడీయిజాన్ని సీఎం జగన్ ఇంతకాలం ప్రోత్సహించారని... ఇప్పుడు వాళ్లను మార్చేసి పతివ్రత అనుకుంటే ఉపయోగం లేదని అన్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాలాంటి వారికే ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని... ఇక సాధారణ పౌరులకేం ఉంటుందని అన్నారు. వైసీపీకి ఇక మిగిలింది వంద రోజులే... ఆ పార్టీ సినిమా అయిపోయింది... ఈ ప్రభుత్వం పోలీసులతో తప్పుడు పనులు చేయిస్తోంది... పోలీసులకూ నేనే దిక్కు... ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇకనైనా పోలీసులు ముందుకు రావాలని అన్నారు. మీరు ప్రస్తుతం సైకో సీఎం కింద కాదు... ఈసీ కింద పనిచేస్తున్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోండని.. మేం అధికారంలోకి రాగానే మహిళలు గౌరవంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు. అంతకుముందు చంద్రబాబు బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం బెంగళూరు, హైదరాబాద్‌తోపాటు విశ్వవ్యాప్తంగా స్థిరపడిన ప్రవాసాంధ్రులైన ఐటీ నిపుణులు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవారు, టీడీపీ అభిమానులు వందరోజులపాటు కష్టపడి పనిచేయాలని పిలుపిచ్చారు. ‘నాకు కష్టం వచ్చినప్పుడు బెంగళూరులో నిరంతరంగా పోరాటాలతో మద్దతు పలికారని.. పలు రాష్ట్రాలతోపాటు 70-80 దేశాల్లో నాపై చూపిన అభిమానం ఏ నాయకుడికీ దక్కదని... ఇందుకు అందరికీ ధన్యవాదాలని అన్నారు. ఇదిలావుండగా... చంద్రబాబు బెంగళూరు విమానాశ్రయం చేరుకున్నప్పుడు రాజకీయంగా విచిత్ర సన్నివేశం చోటు చేసుకుంది. చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి గురువారం చేరుకున్నప్పుడు ... అదే సమయంలో నాగపూర్ వెళ్తున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎదురపడ్డారు. ఈ సమయంలో ఇద్దరూ కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. ఆ తర్వాత భద్రతా బలగాలు, అధికారులకు దూరంగా డీకే... చంద్రబాబును తీసుకెళ్లారు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య రాజకీయా అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ - టీడీపీ అగ్రనేతలు ఇలా... ఏకాంతంగా చర్చించడం ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos