టీడీపీలో సీట్లు దక్కని అసంతృప్తులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు మంతనాలు జరిపారు. తొలి జాబితాలో తమ పేర్లు ప్రకటించకపోవడంపై పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు స్పందించి పలువురు సీనియర్లతో మంతనాలు జరిపారు. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు పైన క్లారిటీ వచ్చింది. ప్రస్తుత స్థానం రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య పోటీ చేయనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది. టీడీపీ తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవటంతో చర్చకు కారణమైంది. అదే సీటును జనసేన నేత కందుల దుర్గేశ్ కూడా ఆశిస్తుండడంతో కొంత ఉత్కంఠకు దారితీసింది. కందుల దుర్గేష్ ను నిడదవోలు నుంచి పోటీ చేయించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని పైన దుర్గేశ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా సీట్లు దక్కని సీనియర్లను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ , మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ తదితరులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. గంటాతో భేటీలో చీపురుపల్లి స్థానంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణపై గంటా పోటీ చేస్తే విజయావకాశాలు బాగుంటాయని సర్వే నివేదికలు వస్తున్నాయని, అక్కడ బరిలో దిగాలని చంద్రబాబు సూచించారు. అయితే తనకు భీమిలిపై ఆసక్తి ఉందని, అది కాకపోయినా విశాఖ జిల్లాలో ఎక్కడ అవకాశమిచ్చినా పోటీ చేస్తానని గంటా చెప్పారని తెలుస్తోంది. ఆ విషయాన్ని తనకు వదిలివేయాలని తాను ఎక్కడ సూచించినా... పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇతర సీనియర్లను కూడా చంద్రబాబు బుజ్జగించడంతో పాటు మలివిడత జాబితాలో అవకాశం కల్పిస్తామని చెప్పడంతో వారు శాంతించినట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos