ఏపీలో టిడిపి- జనసేన పార్టీలు ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పలు జిల్లాల్లో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టిడిపి - వైసిపి మధ్య నువ్వా నేనా అనే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నెల్లూరుజిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వాటిల్లో 6 మంది అభ్యర్ధులను టిడిపి ప్రకటించింది. ముందు నుంచి అనుకున్న విధంగానే నెల్లూరు సిటీ అభ్యర్ధిగా నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఖరారు చేశారు. ఇక్కడ వైసిపి అభ్యర్థిగా ఎండీ ఖలీల్ ను పోటీలో దించారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు సిటీ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఆర్థికంగా రాజకీయంగా ఎంతో బలంగా ఉన్న నారాయణ ముందు ఈయన ఎంత మేరకు పోటీ ఇవ్వగలరో చూడాలి. నెల్లూరు రూరల్ నుండి సిట్టింగ్ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరును ప్రకటించారు. ఇక్కడ వైసిపి అభ్యర్థిగా ఇంకా ఎవరిని నిలుపుతారనేదానిపై క్లారిటీ రాలేదు. గూడూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి అందరూ ఊహించినట్లుగానే మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పేరును చంద్రబాబు ప్రకటించారు. వైసిపి నుంచి మేరుగు మురళి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ వరప్రసాద్ ను పక్కన పెట్టి... ఎమ్మెల్సీగా ఉన్న మేరుగ మురళికి వైసిపి తొలిసారిగా అవకాశం ఇచ్చింది. ఇక సూళ్లూరుపేట కూడా ఎస్సీ నియోజకవర్గమే. ఈ స్థానానికి టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం కుమార్తె విజయశ్రీను పోటీకి దించారు. టిడిపి తొలిసారిగా సూళ్లూరుపేట నుంచి ఒక మహిళా అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. ఇక్కడ వైసీపీ సెట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరోమారు పోటీ చేయనున్నారు. ఈయన పట్ల కూడా సొంత పార్టీలోనే అసమ్మతి గళం వినిపిస్తోంది. ఇక ఉదయగిరి స్థానంలో టిడిపి తరఫున కొత్త అభ్యర్ధికి అవకాశం ఇచ్చారు. గత ఏడాదిగా వివిధ సేవా కార్యక్రమాలతో నియోజకవర్గ ప్రజలకు చేరువైన ఎన్.ఆర్.ఐ కాకార్ల సురేష్ ను ఖరారు చేశారు. ఉదయగిరి వైసిపి ఇన్చార్జిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అయితే ఇక్కడ పార్టీ అభ్యర్థి ఎవరో ఇంకా తేరాల్సి ఉంది. కావలి నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించారు. ఇక మిగిలిన ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి అసెంబ్లీ స్థానాలకు టిడిపి అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. ఆత్మకూరు నుండి ఆనం రామనారాయణరెడ్డి, కోవూరు నుండి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, వెంకటగిరి నుండి కురుగొండ్ల రామకృష్ణ, సర్వేపల్లి నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా వాటిల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మార్పు లేకపోయి ఉన్నట్లయితే ఆయా స్థానాల అభ్యర్ధులను కూడా ఇప్పటికే ప్రకటించే వారు. మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టే ప్రకటించలేదని విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos