తెలంగాణ హైకోర్టులో టాలీవుడ్ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితంలో ముఖ్య ఘట్టాల ఆధారంగా తెరకెక్కించిన వ్యూహం చిత్రం విడుదలకు అనుమతిస్తూ గతంలో సెన్సార్ బోర్డు జారీ చేసిన అనుమతిని ఇవాళ తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సెన్సార్ బోర్డు గతంలో ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను క్వాష్ చేసింది. వైఎస్ జగన్ జీవితంలో ముఖ్య ఘట్టాల ఆధారంగా రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం చిత్రం సినిమాలో విపక్ష నేతలు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పాత్రల్ని కించపరిచేలా సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకూడదని లేఖ కూడా రాశారు. అయితే సెన్సార్ బోర్డు మాత్రం రివ్యూ కమిటీ రిపోర్టు ఆధారంగా వ్యూహం చిత్రం విడుదలకు అనుమతి ఇచ్చింది. దీంతో వ్యూహం చిత్రం విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ నారా లోకేష్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టును సైతం ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు.. ఓటీటీల్లో కూడా ఈ చిత్రం విడుదల కాకుండా ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టులో జరిగిన విచారణలో వ్యూహం చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాల్ని పరిశీలించేందుకు ఓ కమిటీ వేయాలని లోకేష్ తరఫు న్యాయవాదులు కోరారు. అయితే ఈ చిత్ర నిర్మాతల తరఫన వాదించిన లాయర్లు కమిటీ అక్కర్లేదని తెలిపారు. దీనిపై తదుపరి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహం చిత్రానికి ఇప్పటికే సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను రద్దు చేయడమే కాకుండా దీన్ని మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డుకు ఆదేశాలు ఇచ్చింది. మూడు వారాల్లోగా రివ్యూ కమిటీ రిపోర్టును హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. దీన్ని పరిశీలించాక తుది తీర్పు ఇస్తామని వెల్లడించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos