సెకండరీ గ్రేడ్ టీచర్స్ - ఎస్జిటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టులకు అనుమతించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై నిన్న ఫిబ్రవరి 20న విచారణ చేపట్టిన కోర్టు.. ఈ రోజుకు వాయిదా వేసింది. బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్‌పై స్టే విధిస్తూ న్యాయస్థానం నేడు ఆదేశాలు జారీచేసింది. నిన్న జరిగిన విచారణలో ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పింది. ఒకానొక దశలో డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. హాల్‌టికెట్లు జారీచేయవద్దని వ్యాఖ్యానించింది. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వ వద్దని అభ్యర్థించారు. హాల్‌టికెట్లను ఫిబ్రవరి 22 నుంచి జారీ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కోర్టుకు వివరాలు సమర్పించేందుకు విచారణను ఈ రోజుకు అంటే బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇక బుధవారం విచారణ ప్రారంభంకాగానే.. స్టే విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. కాగా ...కోర్టు నిర్ణయంతో డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులుగా మారనున్నారు. అయితే ఇప్పటికే దరఖాస్తు ఫీజు రూ.750 చెల్లించిన బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం ఫీజులను తిరిగి వాపసు చేయనుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కోర్టు ఆదేశాలతో ఇప్పటివరకు ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేకపోయిన బీఈడీ అభ్యర్థులు ఇక దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos