ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పొత్తుల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. కుప్పంలో మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున భువనేశ్వరి ఆర్థిక సయం చేశారు. ఈ సందర్భంగా 'ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’ అంశంపై కుప్పం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో నాకు మద్దతిస్తారా... చంద్రబాబు గారికి మద్దతిస్తారా... అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు... ఈసారి నన్ను గెలిపిస్తారా... అని అడిగారు. దాంతో, ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్లు ఇద్దరూ కావాలంటూ జవాబిచ్చారు. అలా కుదరదు... ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ నారా భువనేశ్వరి కోరారు. అయితే, ఇది తాను సరదాగానే అంటున్నానని చెప్పారు . ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని... రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు... అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని వ్యాఖ్యానించారు. కాగా కుప్పం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు వరుసగా ఏడు సార్లు విజయం సాధించారు. ఈ సారి కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ భారీ కసరత్తు చేస్తోంది. కానీ, చంద్రబాబు తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఈ సమయంలో అనూహ్యంగా నారా భువనేశ్వరి కుప్పం వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు సరదాగానే చేసినా ... పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం వీటిని సీరియస్ గానే తీసుకున్నారు. కాగా ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కారణంగా సీట్ల సర్దుబాట్ల వ్యవహారం సంక్లిష్టంగా మారుతోంది. చంద్రబాబు, లోకేష్, బాలయ్య, భరత్ పోటీలో ఉన్న సమయంలో మరొకరిని బరిలోకి దింపటం పైన చంద్రబాబు సుముఖంగా లేరని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు కుప్పం నుంచి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలతో అధిష్టానం ఆలోచన మారిందా... కుప్పం నుంచి భువనేశ్వరి పోటీ చేయటం ఖాయమైందా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos