ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టే పనులన్నీ అర్థరహితంగా... అనాలోచితంగా ఉంటాయని ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఐదేళ్ల పాటు పబ్బం గడిపిన ముఖ్యమంత్రి జగన్ ... పాలన ముగింపు దశకు వచ్చేసరికి ప్రాజెక్టులపై ప్రేమ ఒలకబోస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2019 లో అధికారంలోకి రాగానే... వెలిగొండ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తిచేసి నీళ్లు ఇస్తామని చెప్పిన జగన్, ఇప్పుడు ప్రాజెక్టు పూర్తికాకుండానే పైలాన్‌ను ఆవిష్కరించారు. ఇదేం పని అంటూ రాజకీయపక్షాల నేతలు,ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా, ఫీడర్ కాలువ లైనింగ్ పనులు పూర్తిచేయకుండానే జాతికి అంకితమివ్వడం ఏంటని నిలదీస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని జగన్... ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేక పోయారు. ఆయకట్టుకు నీళ్లివ్వలేకపోయారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూలు వస్తున్నందున కేవలం రెండు టన్నెళ్లను మాత్రమే జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు అందించాలంటే ఇంకా చాలా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంకా లైనింగ్ పనులు పూర్తి చేయలేదు కానీ ...రెండు టన్నెళ్లు తవ్వి ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేసినట్లు హడావుడి చేశారు. . టన్నెళ్లు తవ్వడంతో పాటు నల్లమలసాగర్‌లో నీటిని నిలబెట్టేందుకు వీలుగా పునరావాసం పూర్తి చేసి, అక్కడి నుంచి జలాలను ఆయకట్టుకు తరలించేలా పనులు చేసి ఉంటే కరవు ప్రాంత ప్రజలు సంతోషపడేవారు. అయితే సరైన ప్రణాళిక లేక, చాలినన్ని నిధులివ్వక జగన్ సర్కారు ప్రాజెక్టును ముందుకు కదపలేకపోయింది. అయిదేళ్లు పూర్తయిపోయి ... మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో కేవలం టన్నెళ్ల తవ్వకంతోనే ప్రాజెక్టు పూర్తయిపోయినట్లు హంగామా చేసింది జగన్ ప్రభుత్వం. మొత్తానికి ఎన్నికలు తరుముకొస్తున్న వేళ... వెలుగొండ ప్రాజెక్టు విషయంలో జగన్ ఆడుతున్న నాటకాలపై ప్రజలు, రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos