ఏపీలోని వైసీపీ, టీడీపీ ... బీజేపీ తో కుమ్మక్కు అయి... ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మూడు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని అన్నారు. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రం లో వైసీపీని ఓడగొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పారు. విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. టీడీపీ చీఫ్ చంద్రబాబువి కనిపించే పొత్తులని, వైసీపీవి కనిపించని పొత్తులని ఎద్దేవా చేశారు. తనకు ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని వైఎస్ జగన్ అన్నారని, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని మర్చిపోయారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ ఒక్క రోజు కూడా ఉద్యమం చేయలేదని... ఉత్తరాంధ్రను రెండు పార్టీలూ మోసం చేశాయని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న కంపెనీలను ప్రైవేట్ కి అప్పనంగా అప్పగిస్తున్నదని ... గంగవరం పోర్టు ను తక్కువ ధరకు అదానీకి అమ్మేసిందని ఆమె ఆరోపించారు. 30 ఏళ్ల లీజు తర్వాత గంగవరం పోర్ట్ ప్రభుత్వ పరం కావాల్సి ఉందని అన్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ వాటా 10 శాతం అగ్గువకే అమ్మేశారని అన్నారు. తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీలను కేంద్ర ప్రభుత్వ కంపెనీలలో విలీనం చేశారని షర్మిల అన్నారు. విశాఖకి రైల్వే జోన్ ఇచ్చారని, అది ఇంకా అమలు కాలేదని చెప్పారు. మెట్రో రైల్ ప్రాజెక్టు పత్తా కూడా లేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అనుకున్నవన్నీ జరిగాయని అన్నారు. అందుకే మళ్లీ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలని అకాంక్షించారు. బీజేపీ తొత్తులుగా ఉన్న వైసీపీ, టీడీపీ లను ఓడగొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos