ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఖరారు కావడం... అందులో అయిదు స్థానాలైన తెనాలి, అనకాపల్లి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, రాజానగరంలో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల పేర్లను పవన్ ప్రకటించడం తెలిసిందే. రాజోలులో తమ పార్టీయే పోటీ చేస్తుందని పవన్ గతంలో చెప్పారు. అంటే ఇప్పటికి ఆరు స్థానాలపై స్పష్టత వచ్చింది. ఇక మిగిలిన 18 స్థానాల్లోనూ మెజారిటీ సీట్లు ఖరారయ్యాయి. వాటిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, అమలాపురం.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నరసాపురం, నిడదవోలు, పోలవరం.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, ఉమ్మడి విశాఖ జిల్లాలో యలమంచిలి.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ జనసేనకు ఖరారైనట్లు సమాచారం. రాజమహేంద్రవరం రూరల్ సీటును టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి నిడదవోలు స్థానాన్ని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. అక్కడి నుంచి పోటీకి దిగాలని కందుల దుర్గేశ్ కు సూచించారు. కాగా జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతంలో దర్శి సీటు కోరగా ... దానికి బదులుగా గిద్దలూరు సీటు ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా అనంతపురం లేదా పుట్టపర్తి స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె స్థానం ఆ పార్టీకి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కడప జిల్లా బద్వేలు లేదా రైల్వే కోడూరు కూడా జనసేన పార్టీ ఆశిస్తున్న వాటిలో ఉన్నాయి. జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో టీడీపీ సీనియర్లు ఆశావహులుగా ఉండటంతో వారిని బుజ్జగించి జనసేన సీట్లు కేటాయించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో జరగనున్న టిడిపి- జనసేన ఉమ్మడి బహిరంగ సభ తరువాత పవన్ తన పార్టీ అభ్యర్దులను ఖరారు చేయనున్నారని సమాచారం. ఇక జనసేనకు కేటాయించిన మూడు ఎంపీ స్థానాల్లో కాకినాడ నుంచి సానా సతీష్, అనకాపల్లి నుంచి నాగబాబు, మచిలీపట్నం నుంచి బాలశౌరి పేర్లు దాదాపు ఖాయమయ్యాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos