టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మరోసారి ప్రజల మధ్యకు రానున్నారు. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా…ప్రస్తుత వైసీపీ సర్కారు పాలనను ఎండగడుతూ చేపడుతున్న శంఖారావం యాత్రను మరోమారు ప్రారంభించ బోతున్నారు. రాయలసీమలో పార్టీ కేడర్ ను సమాయత్తం చేయడానికి ఈ నెల 7న హిందూపురం నుంచి ఈ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై కేడర్ కు యువనేత దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా మన టీడీపీ, బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల అమలులో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలతో భేటీ అయి వారికి ప్రశంసాపత్రాలను అందజేస్తారు. తొలివిడతలో ఉత్తరాంధ్రలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం కేడర్ లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో శంఖారావం మలివిడత యాత్రను తన మామ, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి ప్రారంభించనున్నారు. తొలిరోజు అయిన 7వ తేదీ ఉదయం హిందూపురం, మధ్యాహ్నం మడకశిర, సాయంత్రం పెనుకొండ నియోజకవర్గాల్లో శంఖారావం సభలు నిర్వహిస్తారు. ఈ నెల 8 న ఉదయం పుట్టపర్తి, మధ్యాహ్నం కదిరి సభలకు లోకేష్ హాజరవుతారు. శివరాత్రి నేపథ్యంలో 9న యాత్రకు తాత్కాలిక విరామం ఉంటుంది. తిరిగి ఈ నెల 10 నుంచి యాత్ర యథావిధిగా కొనసాగనుందని పార్టీ అగ్రనేతలు తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos