ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ - జనసేనతో కలిసి వెళ్లేందుకు బీజేపీ అడుగులు వేస్తున్న క్రమంలో జనసేన అధినేత ప్రధాని మోడీకి ఓ కీలక అంశంపై లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు పాతవే అయినా ఇప్పటివరకూ వాటిని బీజేపీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ ఇప్పుడు పవన్ కూడా అదే విషయాలను ప్రస్తావిస్తూ కేంద్ర సంస్ధలతో దర్యాప్తు కోరడం... ఏకంగా ప్రధానికే లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ లో పేద ప్రజలకు నిర్మించి ఇచ్చే ఇళ్ల ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని ... ఈ ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తోందని ... భూ సేకరణలో వైసీపీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని...  ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన లేఖలో కోరారు. ఐదు పేజీల ఈ లేఖలో జగన్ సర్కారుపై పవన్ పలు ఆరోపణలు గుప్పించారు. ఏపీలో 2019 జూన్ నుంచి ఇళ్ల స్ధలాల పంపిణీ, జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని పేర్కొన్నారు. ఇందులో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో రూ.32,141 కోట్ల అక్రమాలు జరిగాయని ... ఈ వ్యవహారంపై అధికార వైసీపీ ప్రజాప్రతినిధే విజిలెన్స్ దర్యాప్తు కోరినట్లు పవన్ తెలిపారు. కానీ ప్రభుత్వం ఈ ఫిర్యాదును పట్టించుకోలేదన్నారు. ఇళ్ల స్ధలాల కోసం సేకరించిన భూముల ధరల్ని ఎడాపెడా పెంచేసి భూములిచ్చిన యజమానులకు తక్కువ ధరలు చెల్లించి మిగతా డబ్బులు వైసీపీ నేతలు జేబుల్లో వేసుకున్నారని పవన్ ఆరోపించారు. ఈ మొత్తం ప్రాజెక్టు విలువే రూ.1.75 లక్షల కోట్లు ఉంటే ... ఈ ఏడాది అక్టోబర్ నాటికి 91 వేల కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇళ్ల పథకం తమదేనని చెప్పుకుంటోందన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా 30 లక్షల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిందని, ఇందులో భాగంగా రూరల్ లో సెంటు, అర్బన్ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున 29.51 లక్షల మంది లబ్ధిదారులకు వీటిని ఇవ్వాల్సి ఉందన్నారు. వీటిలో 21.87 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇందుకోసం 28,445 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇళ్ల స్ధలాలుగా మార్చారని, మరో 25,374 ఎకరాల్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించారన్నారు. ఈ గణాంకాల్లో ఎక్కడా పొంతనలేదని పవన్ కళ్యాణ్ ... ప్రధాని మోడీకి రాసిన లేఖలో వివరాలు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వేల కోట్ల ప్రజాధనం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏమార్చి వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న పథకాల వల్ల ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందో తేల్చేందుకు కేంద్ర సంస్ధలతో దర్యాప్తు చేయించాలని పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని కోరారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos