టీడీపీ అధినేత చంద్రబాబు... చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు నియోజకవర్గ నేతలు, కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. కుప్పంలో జరుగుతున్న తన ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం శాంతిపురం బహిరంగ సభలో మాట్లాడుతూ.. కుప్పంలో తాను కులం, మతం చూడకుండా అందరి ఇంట్లో పెద్ద కొడుకులా ఉన్నానని.. కుప్పం అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ... కుప్పం ప్రాంతానికి ఏం చేసిందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే హంద్రీనీవాకు నీళ్లు వచ్చేవని... వి.కోట వరకు హంద్రీనీవా నీళ్లు అందించిన ఘనత టీడీపీదేనని స్పష్టం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టును తాను 87 శాతం పూర్తి చేస్తే మిగతా 13 శాతం కూడా పూర్తి చేయలేని దద్దమ్మ పార్టీ వైసీపీ అని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనే లేదని.. దోపిడీలు, దుర్మార్గాలు చేయడమే ఆ పార్టీకి తెలుసని ... దోపిడీ దొంగలు, గజదొంగలు రాష్ట్రాన్ని దోచుకోవడానికే అధికారంలోకి వచ్చారని తీవ్రంగా అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని.. రైతులను ప్రోత్సహించేందుకు ఏ కార్యక్రమమైనా చేపట్టారా అని చంద్రబాబు ప్రశ్నించారు. మాట ఇచ్చిన ప్రకారం పులివెందులకు తొలుత నీళ్లు ఇచ్చానని.. ఇక్కడి మంత్రికి ఉన్న ప్రేమ కుప్పంపై కాదని గ్రానైట్ కోసం అని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతల కళ్లన్నీ మద్యం, ఇసుక, మైనింగ్‌పైనే ఉన్నాయి. శాంతిపురంలో ప్రభుత్వ స్థలాలను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని.. దేవుడి భూమిని కూడా వదలడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం అని.. గత 35 ఏళ్లలో తాను ఎప్పుడూ .. ఎవరినీ ఇబ్బంది పెట్టిన చరిత్రే లేదన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే కుప్పం నియోజకవర్గంలోని పొలాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేయిస్తానని చంద్రబాబు చెప్పారు. వంద రోజుల్లో జగన్ మందకు చుక్కలు కనిపిస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos