మరో రెండు నెలల్లో ఏపీలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. అయితే ఇప్పటి వరకూ ఓ విషయంలో మాత్రం జనసేన క్లారిటీ ఇవ్వలేకపోతోంది. వైసీపీ అధినేత జగన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే పులివెందుల అనే సమాధానం వస్తుంది. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విషయానికి వస్తే కుప్పం అని ఆన్సర్ వస్తుంది. కానీ జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అడిగితే... సమాధానం దొరకదు. ఈ విషయంపైనే వైసీపీ శ్రేణుల నుంచి పవన్ కళ్యాణ్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే రెండు చోట్లా జనసేనానికి ఓటమే ఎదురైంది. అయితే ఈసారి పక్కా ప్రణాళికతో ఉన్న పవన్ .. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో దిగాలనే దానిపై నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తిరుపతి, కాకినాడ, గాజువాక, భీమవరం, భీమిలి నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. కానీ జనసేనాని మాత్రం ఈసారి భీమవరం నుంచే బరిలో దిగే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. తాజాగా భీమవరంలో పవన్ కళ్యాణ్ ఉండేందుకు ఇంటి కోసం జనసేన శ్రేణులు వెతుకుతున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పవన్ ఇక్కడి నుంచే పోటీచేస్తారనే ప్రచారానికి ఇది బలం చేకూరుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కోసం భీమవరంలో ఇల్లు వెతకడం వెనుక మరో కారణం కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన గ్రంధి శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ మీద విజయం సాధించారు. అయితే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అంటూ శ్రీనివాస్‌తో పాటుగా వైసీపీ శ్రేణులు పదే పదే విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ భీమవరంలో ఇంటికోసం వెతుకుతున్నట్లు తెలిసింది. 2019 ఎన్నికల్లో జనసేన,టిడిపికి వచ్చిన ఓట్లను ఒకసారి పరిశీలిస్తే జనసేన కు వచ్చిన ఓట్లు కేవలం ఆరు శాతం మాత్రమే. తెలుగుదేశం పార్టీ నలభై శాతానికి పైగా ఓట్లు సాధించింది. 2019 ఎన్నికలలో పవన్ కల్యాణ్ కు భీమవరంలో 62,285 ఓట్లు లభించాయి. టిడిపి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు కు 54, 037 ఓట్లు వచ్చాయి. అంటే ఈ రెండు పార్టీలకు కలిపి 1,16,322 ఓట్లు లభించాయి. సో... ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే... ఇక్కడ వైసీపీ అభ్యర్థిని సునాయాసంగా ఓడించవచ్చని రెండు పార్టీల నేతలు బలంగా నమ్ముతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos