టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో ఏర్పాటు చేసిన నవశకం బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. యువగళం సభకు ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు, యువనేత నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ పెద్దలు, తెలుగుమహిళలు, కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక నమస్సుమాంజలి అంటూ పవన్ ప్రసంగం ప్రారంభించారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు, జనసేన శ్రేణులు, వీరమహిళలకు శుభాభివందనం... సోదరుడు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక అభినందనలు అంటూ పేర్కొన్నారు. "నన్ను సభకు ఆహ్వానించినపుడు నేను ఒకటే చెప్పానని... 226 రోజులు, 3,132 కి.మీ. నడిచినందున... యాత్ర ముగింపు సభలో లోకేష్ ఉంటేనే బాగుంటుందని చెప్పానని అన్నారు. కానీ, ఈ సభలో నువ్వు ఉండాలి అంటూ లోకేష్ ఆహ్వానించాడని... నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవజ్ఞుడు చంద్రబాబు కోరడంతో ఇక్కడకు వచ్చానని అన్నారు. లోకేష్ యువగళం జగన్ చేసినటువంటి ఆషామాషీ పాదయాత్ర కాదు... మాటల యాత్ర కాదని... చేతల యాత్ర అంటూ లోకేష్ కు అభినందనలు" అని తన ప్రసంగాన్ని కొనసాగించారు. వాస్తవంగా తనకు కూడా పాదయాత్ర చేయాలని ఉందని... అయితే తాను నడిచే పరిస్థితి లేదని అన్నారు. పాదయాత్ర వల్ల చాలామంది కష్టసుఖాలు తెలుసుకోవచ్చని, అలాంటి అవకాశం రానందుకు బాధపడుతున్నానని ... అయిత లోకేష్ దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఎన్డీఏలో కీలక పాత్ర వహించిన వ్యక్తి, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపడం తనను బాధించిందన్నారు. జగన్ ను జైలులో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే, జగన్ చంద్రబాబుపై కక్షగట్టారన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బాధను అర్థం చేసుకున్నానని, కష్టాల్లో ఉన్నపుడు తన వంతు సాయంగా రాజమండ్రి జైలు వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపానని పవన్ వెల్లడించారు. రాజధాని లేకుండా, సరైన పంపకాలు లేకుండా విభజన జరగడంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆనాడు టీడీపీ సంకీర్ణానికి మద్దతు ఇచ్చానని ... అప్పట్లో ఒక దశాబ్దకాలం పాటు అండగా నిలుద్దామని భావించానని, దురదృష్టవశాత్తు అభిప్రాయ భేదాల వల్ల 2019లో దురదృష్టవశాత్తు మిస్ అయ్యామన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబులాంటి వారికే ఇలాంటి పరిస్థితి వస్తే, భవిష్యత్తులో సామాన్యుడి పరిస్థితి ఏమిటి... రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఎలా వస్తాయని పవన్ ప్రశ్నించారు. 2024లో మన ప్రభుత్వం స్థాపిస్తున్నామని, మార్పు తెస్తున్నామని, జగన్ ను ఇంటికి పంపిద్దామని పిలుపునిచ్చారు. పాతికమంది ఎమ్మెల్యేలను మార్చారని, మొత్తం 80మందిని మారుస్తారని విన్నానని ... మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు... ముఖ్యమంత్రి జగన్ ని అన్నారు. తనకు జగన్ పై వ్యక్తిగత కక్ష లేదని... ప్రభుత్వాన్ని సమర్థంగా నడపాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడన్నారు. వైసీపీ వాలంటీర్లు ఆడపడుచుల డాటా సేకరిస్తున్నారని... దీనిపై నిలదీయాలని కొందరు పెద్దలు చెప్పినపుడు తాను నమ్మలేదని... వాస్తవాలు తెలుసుకున్నాకనే వైసీపీ వాలంటీర్ వ్యవస్థపై గళమెత్తానన్నారు. ఒంటరి మహిళలు, ఆడవాళ్లు, భర్తలేనివారు అన్యాయానికి గురవుతుంటే తెగించి మాట్లాడానన్నారు. ఇప్పటం సభలో వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పానని... రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని... పెట్టుబడులు రావాలని భావించి తాను ఆ మాటలు అన్నానని అన్నారు. బీజేపీని మోసం చేశానని తనను అప్పట్లో వైసీపీ నేతలు విమర్శించారని, అయితే ఏపీ పరిస్థితులను బీజేపీ జాతీయ నాయకత్వానికి వివరించానని పవన్ అన్నారు. టీడీపీ - జనసేన పొత్తుకు మీ మద్దతు కావాలని అమిత్ షాకు తెలియజేశానని... వారు ఎంతవరకు ఒప్పుకుంటారో తెలియదని ... రాబోయే ఎన్నికల పొత్తు కీలకమైందని, పొత్తు పెట్టకోకపోతే భవిష్యత్తులో కర్రలు, కత్తులతో రోడ్లపైకి వచ్చి కొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. తనతో సహా అందరం ఆయుధాలతో రోడ్లపైకి రావాల్సి వస్తుందని బీజేపీ కేంద్రనాయకత్వానికి చెప్పానని అన్నారు. టీడీపీ-జనసేన మైత్రికి బీజేపీ అధినాయకత్వం మద్దతునిస్తుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos