కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒక్కొక్క పార్టీ కూటమి నుంచి వైదొలుగుతున్నాయి. ఇప్పటికే కూటమిలో ప్రధాన పార్టీలు కీలక సమావేశాలకు డుమ్మా కొడుతున్నాయి. ఇటీవల మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనువడు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ బీజేపీలో చేరారు. ఆయన దారిలో పలువురు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక ఆమ్ ఆద్మీ కూటమిని విస్మరించి లోక్ సభ ఎన్నికలపై గురి పెట్టింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా... కూటమితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తాజాగా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ కాన్ఫరెన్స్ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని తన నిర్ణయాన్ని ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. సొంత బలంపైనే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు, ప్రశ్నలకు తావు లేదని అన్నారు. ఇండియా కూటమి ఏర్పాటులో ఫరూక్ అబ్దుల్లా కీలక పాత్రను పోషించిన విషయం గమనార్హం. ఇండియా కూటమికి చెందిన అన్ని సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, ఆయన చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు, కూటమితో కలిసి వెళ్లకుండా, ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయానికి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా... ఫరూక్ అబ్దుల్లాకు ఇటీవలే ఈడీ సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై సమన్లు పంపింది. క్రికెట్ అసోసియేషన్ నిధులు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లు, సంబంధం లేని అకౌంట్లకు మళ్లాయని ఈడీ ఆరోపించింది. అసోసియేషన్ అకౌంట్ల నుంచి అనుమానాస్పదమైన క్యాష్ విత్ డ్రాలు జరిగాయని కేసులో ఈడీ పేర్కొంది. అయితే, ఈ సమన్లపై ఈడీకి ఈమెయిల్ ద్వారా ఫరూక్ అబ్దుల్లా సమాధానం ఇచ్చారు. తాను టౌన్ లో లేకపోవడం వల్ల ఈడీ విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఈడీ కేసులకు ... ఫరూక్ అబ్దుల్లా ఇండియా కూటమి నుంచి బయటికి రావడానికి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు జరుగుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos