తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, చెన్నూర్ మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్‌పై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అంతకుముందు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడి మాటలదాడికి దిగారు. ఇందులో భాగంగా బాల్క సుమన్ రెచ్చిపోయి... రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. అనేక ఆరోపణలను సంధించారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ ఎదురుదాడికి దిగారు. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన అంశాన్ని బాల్క సుమన్ మంచిర్యాల నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ప్రస్తావిస్తూ... ఎన్నో ఏళ్ల పాటు పోరాడి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి రండగా చెప్పడాన్ని తప్పుపట్టారు. ఒక దశలో నిగ్రహాన్ని కోల్పోయిన బాల్క సుమన్ ఆవేశంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకుని కొడతానంటూ హెచ్చరించారు. అసభ్య పదజాలంలో విరుచుకుపడ్డారు. తమకు సంస్కారం అడ్డు వస్తోందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డీ ఖబడ్దార్ అంటూ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం లేకపోయినా సరే.. కేసీఆర్ జోలికి వస్తే తొక్కి పడేస్తాం అంటూ హెచ్చరించారు. దీంతో బాల్క సుమన్ పై పలువురు కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడుతూ ... ఆయనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బాల్క సుమన్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తీవ్రంగా ఖండించారు. బాల్క సుమన్ ఎక్కడో వేరే జిల్లా నుంచి వచ్చి మంచిర్యాల జిల్లాలో పెత్తనం చేస్తానంటే కుదరదని అన్నారు. బాల్క సుమన్ కు కాంగ్రెస్ కార్యకర్తలు తగిన శాస్తి చేస్తారని అన్నారు. బాల్క సుమన్ చేసిన ఆగడాలు, రాసలీలలు అన్ని త్వరలో బయటపెడతానని ఆయన అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos