ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్బంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడైన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి నివాళులు అంటూ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘తెలుగు ప్రజలారా రండి. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం... ఎన్టీఆర్కు అసలైన నివాళి అర్పించుదాం’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతతో తెలుగునేల అల్లాడుతున్న ఈ వేళ... తిరిగి రామరాజ్య స్థాపనకు ఎన్టీఆర్ స్ఫూర్తిగా మనందరం కదలాలి... అందుకే 'తెలుగుదేశం పిలుస్తోంది రా... కదలిరా!' అని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా నేను 'రా... కదలిరా!' అని పిలుపునిచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు.‘‘ ఒకే ఒక జీవితం.. రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది... తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ ఫొటోని జోడించారు.
ఇదిలావుండగా... ఈసారి గుడివాడలో... ఎలాగైనా కొడాలి నానిని ఓడించి తీరాలని పట్టుదలగా ఉన్న టీడీపీ ... ఎన్నారై వెనిగండ్ల రామును బరిలోకి దింపింది. స్వయంగా కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికే చెందిన వెనిగండ్ల రాముకు ఎస్సీ అయిన ఆయన భార్య రూపంలో మరో సానుకూలత కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న ఎస్సీ ఓట్లను గంపగుత్తగా వేయించుకోవడంలో సక్సెస్ అవుతున్న కొడాలి నాని వరుస విజయాలు సాధిస్తున్నారు. దీంతో ఈ ఎస్సీ ఓట్లను చీల్చేందుకు రాముకు టీడీపీ సీటు ఇస్తోంది. ఇప్పటికే ఇక్కడ రాముకు పోటీగా ఇన్ ఛార్జ్ గా రావి వెంకటేశ్వరరావు ఉన్నప్పటికీ ఆయనకు సర్దిచెప్పడంలో టీడీపీ అధిష్టానం సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు వెనిగండ్ల రాము.. వచ్చే ఎన్నికల్లో కొడాలిని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతంతో పోలిస్తే టీడీపీలో అంతర్గత పోరు తగ్గడం, వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొడాలిపై ఉన్న వ్యతిరేకత కచ్చితంగా తమకు కలిసి వస్తాయని తమ్ముళ్లు అంచనా వేసుకుంటున్నారు. అయితే ఇదంతా తేలాలంటే ముందు ఇక్కడ జరిగే రా కదలిరా సభలో పార్టీలో నేతల ఐక్యతతో పాటు కొడాలిని ఓడించగలమన్న ధీమా కనబరిస్తే వచ్చే ఎన్నికలకు ఓటర్లకు టీడీపీ ఓ సందేశం ఇచ్చినట్లవుతుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos