వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జిల మార్పు వ్యవహారం ఇంకా కొనసాగుతుండటంతో... తమ భవిష్యత్ ఏమిటో తెలియని పలువురు నేతలు... పార్టీల వైపు తొంగి చూస్తున్నారు. ఈ క్రమంలో... మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేరు కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఆయన టీడీపీలోకి వెళతారంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీలో చేరితే మైలవరం లేదా పెనమలూరులలో ఆయనను బరిలో దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వసంత కుటుంబానికి ప్రత్యర్ధిగా ఉన్న దేవినేని ఉమా.. కృష్ణప్రసాద్‌ను సైకిల్ ఎక్కనిస్తారా అన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. ఎందుకంటే... మైలవరం, నందిగామ ప్రాంతాల్లో ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తొలుత టీడీపీలోనే ఉన్న ఈ రెండు కుటుంబాల మధ్య ... ఆ తరువాత కాలంలో రాజకీయ వైరం వచ్చింది. ఒకప్పుడు కృష్ణా జిల్లాను ఒకప్పుడు శాసించిన వసంత నాగేశ్వరరావు... తన వారసుడిగా వసంత కృష్ణప్రసాద్‌ను ప్రకటించి .. తాను తెరవెనుక రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ఆ తరువాత జరిగిన అనేక రాజకీయ పరిణామాల క్రమంలో ... వసంత కుటుంబం కాంగ్రెస్ లో చేరగా...1999లో జరిగిన ఎన్నికల్లో దేవినేని ఉమా టీడీపీ నుంచి...  కృష్ణప్రసాద్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా ఉమ విజయం సాధించారు. 2004లో ఉమా టీడీపీ నుంచి పోటీ చేయగా...  ఈసారి వసంత నాగేశ్వరరావు కొడుకుకు బదులుగా స్వయంగా తానే బరిలో దిగారు. అయినప్పటికీ ఉమానే విజయం వరించింది.  తదనంతర కాలంలో నందిగామ ఎస్సీ రిజర్వుడు అయింది. దీంతో దేవినేని, వసంత కుటుంబాలు మైలవరానికి షిప్ట్ అయ్యాయి. 2009లో దేవినేని ఉమా టీడీపీ నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. కమ్మ సామాజిక వర్గానికి మైలవరం పెట్టని కోట కావడంతో ఇరు కుటుంబాలు ఈ సెగ్మెంట్‌నే తమ రాజకీయానికి వేదికగా మార్చుకున్నాయి. కానీ టీడీపీలో ఉమా ఉన్నంతవరకు వసంత గెలుపొందడం కష్టమని తేలిపోయింది. దీంతో 2019 ఎన్నికలకు ముందు వసంత కుటుంబం జగన్ సమక్షంలో వైసీపీలో చేరింది. ఆ ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్.. తన చిరకాల ప్రత్యర్ధి ఉమాను ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో నిన్నమొన్నటి వరకు జగన్‌పై వసంత కుటుంబానికి సాఫ్ట్ కార్నర్ ఉండేది. ముఖ్యంగా తన కొడుకును ఎమ్మెల్యేను చేసింది వైసీపీయేనంటూ సన్నిహితుల వద్ద జగన్‌పై వసంత నాగేశ్వరరావు ప్రశంసలు కురిపించేవారు. అయితే... జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కొడాలి నానిని తప్పించడంతో ఆయన స్థానంలో.. కమ్మ కోటాలో తన కుమారుడికి మంత్రి పదవి వస్తుందని వసంత నాగేశ్వరరావు భావించారు. కానీ దానికి భిన్నంగా జోగి రమేష్‌ను పదవి వరించడాన్ని నాగేశ్వరరావు జీర్ణించుకోలేకపోయారు. అతనికి జగన్ మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు. దీనికి పర్యవసానంగానే జగన్,  వైసీపీలపై వసంత నాగేశ్వరరావు ఘాటు విమర్శలు చేయడం ప్రారంభించారు. మరోవైపు జగన్ నియోజకవర్గాల సమన్వయకర్తలను ఎంపిక చేసే పని మొదలుపెట్టడంతో... వసంత పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీలో ఆయనకు ప్రాధాన్యత లేకపోవడంతోనే కృష్ణప్రసాద్ పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జోగి రమేష్‌ను అభ్యర్ధిగా దించారు జగన్. కాగా... జోగి రమేష్‌పై పీకలదాకా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ ... టీడీపీలో చేరి పెనమలూరు నుంచి పోటీ చేసేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు టాక్.  చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో వసంత, దేవినేని ఉమాల పేర్లతో సర్వే చేయిస్తున్నారని సమాచారం. రెండింట్లో ఒకదానిని వసంతకు కేటాయించి, మరో దానిని ఉమాకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పెనమలూరు, మైలవరం నియోజకవర్గాలను ఈ రెండు కుటుంబాలకు సర్దుబాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. చివరకు ఏం చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos