ఏపీలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా... సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్సీపీ ఇప్పుడు కొత్త సవాల్ ను ఎదుర్కోబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పదేళ్ల క్రితం రాష్ట్ర విభజనతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ ... ఏపీలో పునర్వైభవం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులోభాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలింది. ఇది కాస్త వచ్చేస్తే ఇక ఏపీలో వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల పోరు ప్రారంభం అవుతుంది. అంటే అన్నాచెల్లెళ్ల పోరు అన్నమాట. సీఎం వైఎస్ జగన్ ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనను లైట్ తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా తమకు ఎదురులేదని భావిస్తున్నారు. కానీ చెల్లెలు వైఎస్ షర్మిల ... ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే మాత్రం లైట్ తీసుకునే పరిస్ధితి కచ్చితంగా ఉండకపోవచ్చనని అంటున్నారు. గతంలో తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్న చెల్లెలు షర్మిల ... ఇప్పుడు స్వరాష్ట్రంలో తిరిగి అదే చెల్లెలు తనకు పోటీగా వస్తే ఏం చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల పోరు మొదలైతే ... వారి తల్లి విజయమ్మ... పిల్లలిద్దరిలో ఎవరిని సమర్థించినా మరొకరికి ఇబ్బందికర పరిస్దితులు తప్పవు. అందువల్ల ఆమె ఇద్దరికీ దూరంగా హైదరాబాద్ లోనే ఉండిపోవడం ఖాయమని అంటున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని ... ఏ పార్టీలోనైనా చేరవచ్చని అన్నారు. షర్మిల విషయంలోనూ ఇదే వర్తిస్తుందని రోజా స్పష్టం చేశారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్‌మోహన్‌రెడ్డిది కాదని అన్నారు. ఇక తనకు నగరి టికెట్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నది పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయమని ... ఆయన తనకు సీటు ఇవ్వకపోయినా మనస్ఫూర్తిగా అంగీకరించి, పార్టీ అప్పగించిన బాధ్యతలకు అనుగుణంగా ముందుకెళతానని వివరించారు. జగనన్న మాట శిరసావహిస్తానని చెప్పారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు ఇక రసవత్తరంగా మారనున్నాయన్నది మాత్రం వాస్తవం.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos