ఏపీ సీఎం... స్వయాన తన సోదరుడు అయిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీని అధికారంలో నుంచి గద్దె దించాలని... జగన్ ను ఇంటికి సాగనంపాలన్న లక్ష్యంతో పీసీసీ చీఫ్ గా ఏపీలోకి ఎంటర్ అయిన షర్మిల ... వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా జగన్ మరోసారి పోటీ చేయటం ఖాయం. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్ రెడ్డి తిరిగి పోటీ చేస్తారని చెబుతున్నారు. దీంతో వైసీపీ నుంచి అభ్యర్దుల విషయంలో అధికారికంగా నిర్ణయం వెలువడిన తరువాత కాంగ్రెస్, టీడీపీ తమ అభ్యర్దులను ఖరారు చేయాలని భావిస్తున్నాయి. కొంత కాలంగా వివేకా కుమార్తె సునీత కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం ఉంది. అయితే ఇటీవల ఇడుపులపాయలో షర్మిలతో భేటీ సమయంలో... తాను పార్టీలో చేరటం లేదని సునీత క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. కాగా షర్మిల కడప పార్లమెంట్ స్థానంలో కానీ ... పులివెందుల అసెంబ్లీ స్థానంలో కానీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు... టీడీపీ ఒక్క కడప ఎంపీ స్థానానికి తప్ప మిగిలిన ఎంపీ స్థానాలకు అభ్యర్థులను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. కడప విషయంలో మాత్రం వైసీపీ, కాంగ్రెస్ నిర్ణయం తరువాతనే తమ అభ్యర్దిని ఫైనల్ చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే... ఇదే సందర్భంలో తాజాగా ఒక కీలక ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. కడప ఎంపీగా వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేలా కొత్త వ్యూహం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. వివేకా కుటుంబానికి మద్దతుగా నిలుస్తామనే నినాదంతో టీడీపీ, కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను నిలబెట్టకుండా అక్కడ సౌభాగ్యమ్మ పోటీలో ఉంటే ... ఆ రెండు పార్టీలు మద్దతు ఇచ్చేలా కొత్త ప్రణాళికలతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా ముఖ్యమంత్రి జగన్ ను, ఎంపీ అవినాష్ ను టార్గెట్ చేయాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు వైసీపీలోనూ కడప జిల్లాలోని అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉందనే తెలుస్తోంది. జమ్మలమడుగు, కమలాపురం, కడప అసెంబ్లీ స్థానాల్లో మార్పులు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. కడప కేంద్రంగా సీఎం జగన్ ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టే విధంగా కాంగ్రెస్, టీడీపీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల సమయంలో కడప జిల్లాలో చోటు చేసుకొనే రాజకీయం పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos