ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు రోజుల పాటు మధ్యంతర బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశాలు ప్రారంభమమయ్యే మొదటి రోజే అంటే 5వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. తదనంతరం 6, 7 తేదీల్లో మధ్యంతర బడ్జెట్‌పై చర్చలు జరగనున్నాయి. ఎన్నికల సంవత్సరం అయినందున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఖర్చుల కోసం అవసరమైన నిధులను కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకుంటారు. దీనికి ఆమోదం తెలపడం కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్నికలు పూర్తయ్యాక కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెడుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపైనే దృష్టి సారిస్తుందని తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేయనుంది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో టీడీపీ హయాంలోని 2014-19తో పోలుస్తూ ... ఈ ఐదేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని హైలైట్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ బడ్జెట్లో ఎన్నికల ప్రణాళికను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ... ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం పథకాన్ని ప్రకటించిన క్రమంలో... వైసీపీ కూడా అలాంటి ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ రుణమాఫీని కూడా బడ్జెట్ సెషన్లో ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉంది. కాగా ... రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు మూడురోజుల అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos