ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమం లో రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ లలో రాజకీయ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ విషయానికొస్తే,.. విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని శ్రీనివాస్ ఉరఫ్ నాని వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వారం, పది రోజుల్లో ఆయన వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచే ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో తాను పోటీ చేయబోనని నాని పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబుకే స్పష్టం చేశారు. అదే సమయంలో పార్లమెంట్ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలతో ఆయన కలివిడిగా ఉంటున్నారు. ఎంపీ నియోజకవర్గ నిధులు కూడా వారు సూచించిన పనులకే ఇచ్చేవారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీడీపీ శ్రేణులు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినా ‘ప్రొటోకాల్’ పేరుతో నాని తన విధానాన్ని సమర్థించుకునేవారు. ఇదిలావుంటే, నాని కుమార్తె, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో 11వ వార్డు టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్న కేశినేని శ్వేత సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. మేయర్ భాగ్యలక్ష్మిని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. టీడీపీకి కూడా రాజీనామా చేశారు. మరోవైపు... వై సీ పీ లోనూ అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జిల మార్పుతో వైసీపీలో హీటెక్కిన అసంతృప్తి తీవ్రరూపం దాల్చుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం మొదలైంది. పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని... సీఎం జగన్ నిన్న తన కార్యాలయానికి పిలిపించి 20 నిమిషాలకుపైగా మాట్లాడారు. పార్టీని వీడొద్దని, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన ముుభావంగానే ఉన్నట్టు సమాచారం.వైసీపీ సాధికార బస్సు యాత్రలో పార్థసారథి ఇటీవల అందరిముందు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. జగన్ తనను గుర్తించకపోయినా పెనమలూరు ప్రజలు మాత్రం తనకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నారని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పలు ఊహాగానాలకు కారణమయ్యాయి. ఆయన పార్టీని వీడబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఎమ్మెల్యే అనిల్‌కుమార్.. జగన్ సూచనతో పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, అనిల్ కలిసి పార్థసారథిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. అయితే, జగన్‌తో చర్చల తర్వాత కూడా పార్థసారథి అసంతృప్తిగానే ఉన్నారని, పార్టీ వీడాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. మొత్తానికి రెండు పార్టీల్లోనూ ఆయా పార్టీల అధిస్టానాలపై ఆ పార్టీల్లోని నేతలు... టికెట్ల ఆశావహులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos