ప్రపంచంలో అతి ఎత్తైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం జాతికి అంకితం చేశారు. దీనికి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టారు. ఏపీ ప్రభుత్వం విజయవాడ నగరంలో రూ. 404 కోట్లతో 18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని నెలకొల్పి ... భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 20వ తేదీ నుండి అంటే రేపటి నుంచి అంబేద్కర్ స్మృతి వనానికి ప్రజలను అనుమతిస్తారు. అంబేద్కర్ విగ్రహాన్ని 81 అడుగుల బేస్ తో 125 అడుగుల ఎత్తుతో నిర్మించారు. పెడస్టల్ సైజు 3,481 చదరపు అడుగులు. పెడస్టల్ తో కలుపుకుంటే విగ్రహం ఎత్తు 206 అడగులు. జీ+ప్లస్ టూ అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఈ విగ్రహానికి 400 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉపయోగించారు. 120 మెట్రిక్ టన్నుల కాంస్యం ... 2200 టన్నుల శాండ్ స్టోన్ ను ఉపయోగించారు. అంబేద్కర్ స్మృతి వనంలో అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. మరోవైపు రాత్రి పూట మిరుమిట్లుగొలిపేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. గంటకు 350 కి.మీ. వేగంతో గాలులు వీచినా కూడా ఈ విగ్రహానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇంజనీర్లు ప్రకటించారు. అంబేద్కర్ జీవితంలో చోటు చేసుకున్న ఘట్టాలు తెలిపేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేశారు. 2022 మార్చి 21న స్మృతి వనం పనులను ప్రారంభించారు. రెండేళ్ల పాటు మూడు షిప్టుల్లో 600 మంది కూలీలు ఈ పనులు చేపట్టారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఏర్పాటు చేసిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా పేరు పొందింది. అంబేద్కర్ విగ్రహాల్లో ఏపీ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం అతి పెద్దదిగా రికార్డు సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం పెడస్టల్ తో కలుపుకుంటే 206 అడుగులు ఉంది
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos