ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె బాట పట్టారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీలపై డిమాండ్ చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకులు ... ప్రభుత్వం మాట తప్పిందంటూ ఆందోళనలు చేపట్టారు. తమ డిమాండ్లని ప్రభుత్వానికి విన్నవించినా స్పందన రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏపీ అంగన్ వాడీ వర్కర్, హెల్పర్స్ యూనియన్, అంగన్ వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్, ప్రగతి శీల అంగన్ వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాలతోపాటు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో వారు ఆందోళనలు చేపట్టారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు... నాలుగున్నరేళ్లుగా తమ సమస్యలు పరిష్కరించనందుకు నిరసనగా డిమాండ్ల సాధనకు మూకుమ్మడిగా సమ్మె బాట పట్టినట్లు వారు తెలిపారు. తెలంగాణ కన్నా ఏపీలో అదనంగా వేతనాలు పెంచాలని... ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాలని, టీఏ బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తూ... రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో రిలే నిరసన దీక్షలకు దిగారు. రాష్ట్ర కమిటీ ఆదేశాలతో అంగన్ వాడీ సెంటర్లను మూసివేసి సమ్మెలో భారీగా పాల్గొన్నారు. కాగా... అంగన్ వాడీ కార్యకర్తల ఆందోళనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వారి ఆందోళనలకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ... అందరినీ మోసం చేసినట్లుగానే... జగన్ అంగన్ వాడీలను కూడా మోసం చేశారని విమర్శించారు. అంగన్ వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని.. గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని... పని భారం పెంచారు కానీ జీతాలను పెంచడం లేదని అన్నారు. నాసిరకం ఫోన్లు ఇచ్చి యాప్ లలో విధులకు సంబంధించిన వివరాలు అప్డేట్ చేయమంటే ఎలా చేయాలని అన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. దాదాపు లక్ష మంది వరకు అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉన్నారు. త్వరలో ఎన్నికలు రాబోతున్న క్రమంలో సీఎం జగన్ పాజిటివ్ గా స్పందిస్తారని ఆందోళనకారులు ఆశ పడుతున్నారు. జగన్ ఎలా స్పందిస్తారో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos