మన రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తానంటూ ప్రకటించిన జగన్ ఇటీవల మరింత డాంబికాలకు పోయి... రూ.5 లక్షల మెడికల్ ప్యాకేజీని ఏకంగా రూ.25 లక్షలకు పెంచుతూ దర్పం చూపించారు. అయితే అసలు విషయమేమిటంటే... పేదలు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు ఎప్పటికప్పుడు బకాయిల డబ్బులు చెల్లించకపోవడంతో అవికాస్త కోట్లకు కోట్ల రూపాయలు పేరుకుపోయాయి. దీంతో ఆ ఆసుపత్రుల యాజమాన్యాలు... ఇక మేం ఆరోగ్యశ్రీ సేవలు అందించలేం బాబోయ్ అంటూ చేతులెత్తేశాయి. పెండింగ్ బకాయిలు, చాలీచాలని ప్యాకేజీలు, అనేక సమస్యల మధ్య రోగులకు వైద్యసేవలు అందించడం మా వల్ల కాదు... ఇప్పటికే అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించాం... ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అనేకసార్లు హామీలిచ్చారు... మాట తప్పారు... ఇక ఓర్పుతో ఉండడం మా వల్ల కాదు. కాబట్టి అన్ని సేవలూ నిలిపివేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ హాస్పిటల్స్ అసోసియేషన్ – ఆశా ప్రతినిధులు మరోసారి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు లేఖ రాశారు. 2007 నుంచి ఆరోగ్యశ్రీ రోగులకు సేవలు అందిస్తున్నామని, 2013లో ఒకసారి మాత్రమే ప్యాకేజీలు పెంచారని అసోసియేషన్ ప్రతినిధులు గుర్తుచేశారు. ఇటీవల రూ.5లక్షల ప్యాకేజీని రూ.25 లక్షలకు పెంచడం వల్ల రాష్ట్రంలో నగదుతో వైద్యం చేయించుకునే వారి సంఖ్య మరింత తగ్గడంతోపాటు ఆస్పత్రులపై మరింత భారం పెరిగిందని అన్నారు. సమస్యలపై అనేకసార్లు ట్రస్ట్‌కు విన్నవించినా స్పందన లేదని, దీంతో ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ కింద కొత్త రోగులను తమ ఆస్పత్రుల్లో చేర్చుకోమని, ఈహెచ్ఎస్ తోపాటు అన్నిరకాల సేవలు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. అసోసియేషన్ అంచనా ప్రకారం దాదాపు రూ.1000 కోట్లు బకాయిలు ఉంటాయి. కాగా, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయాలని గత నెలలోనే నెట్వర్క్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపి ... నెట్వర్క్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబరు 15 నాటికి ప్యాకేజీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు. ఇప్పటివరకూ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. పైగా ఆస్పత్రుల బకాయిల విడుదల్లో కూడా తాత్సారం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారమయ్యే వరకూ నిరసన కొనసాగించాలని ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఇదిలావుండగా... కుటుంబ వార్షిక చికిత్స పరిమితి ప్రస్తుతం రూ.5 లక్షలు ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల దాన్ని రూ.25 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. పెంపు నిర్ణయం ప్రైవేటు ఆసుపత్రులపై ఆర్థిక భారాన్ని పెంచింది. ఆయుష్మాన్ భారత్ కింద నిర్ణయించిన ధరలను పరిగణనలోకి తీసుకుని ఇటీవల ప్యాకేజీ ధరలను 10శాతం తగ్గించారు. 70శాతం ప్యాకేజీ ధరల్లో మార్పు చేయలేదు. మిగిలిన ప్యాకేజీల ధరల పెంపు 2.5 శాతం మేర పెరిగింది. ఈ చర్యలతో ఆసుపత్రులకు ఆర్ధికంగా జరిగిన ప్రయోజనం శూన్యం. ఈ పరిస్థితుల్లో వైద్య సేవల నిలిపివేత నిర్ణయం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునో తీసుకున్నది కాదని... గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ కేసులను చూడకూడదని నిర్ణయించామని ‘ఆశా’ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. సీఎం జగన్ ... పేదోళ్లందరికీ ఖరీదైన వైద్యం అంటూ మాటలు ఊదరగొడుతూ... ఇప్పుడు ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా ... మాకు ఆరోగ్యశ్రీ సేవలు కూడా దూరం చేసేందుకు సిద్ధపడ్డారంటూ పేదప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసమే మళ్లీ వైసీపీకి, జగన్ కు ఓటెయ్యాలా అని నిలదీస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos