ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకునేందుకు అధికార వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. తాజాగా పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తిరిగి గెలిచే అవకాశం లేదని తేలిపోవడంతో వారిని పార్టీ అధినేత అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చేస్తున్నారు. ఆయా చోట్ల కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్దేశిత సమయం కంటే 15 నుంచి 20 రోజుల ముందుగానే జరుగుతాయని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ మంత్రులతో ఈ వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. కాబట్టి, ఎన్నికలకు అందరూ పూర్తిగా రెడీగా ఉండాలని అన్నట్లు తెలిసింది. మన పార్టీ ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉందని, అయినప్పటికీ మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థంగా పనిచేయాలని సీఎం నిర్దేశించారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని సీఎం అన్నారు. కాగా ఈసారి ఎన్నికల్లో పార్టీలో భారీ ఎత్తున అభ్యర్ధుల్ని మారుస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రుల్ని స్ధానికంగా ఉండాలని జగన్ కోరడం ఆసక్తి రేపుతోంది. అసంతృప్తుల్ని సమన్వయం చేసే బాధ్యతను మంత్రులకే జగన్ అప్పగించినట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos