టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన యువగళం - నవశకం బహిరంగ సభ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులతో సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత రద్దీగా కనిపించింది. టీడీపీ తరఫున ఈ సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితర నేతలు హాజరు కాగా... జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. సభ ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. ఈ సభకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు కూడా తరలి రావడం విశేషం. ఈ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ... నారా లోకేష్ చేసిన పాదయాత్రకు జగన్ సర్కారు అనేక అడ్డంకులు సృష్టించిందని ... యువగళం వాలంటీర్లను జైలుకు పంపిందని మండిపడ్డారు. దీనికి తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. అధికార వైసీపీ నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోతోందని... ఒకప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉండేదని.. ఇప్పుడు గంజాయి రాజదానిగా మారిందని ధ్వజమెత్తారు. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని... విధ్వంస పాలనకు జగన్ నాంది పలికారని విమర్శించారు. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ పారిపోయాయని ... రుషికొండను బోడి గుండు చేశారని.. సీఎం నివాసం కోసం రూ. 500 కోట్లతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండివుంటే 2020 నాటికి పోలవరం పూర్తి చేసేవాళ్లమన్నారు చంద్రబాబు. అబద్ధాల పునాదులపై నిర్మించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఓడించి... వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి.. టీడీపీ-జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ సభలో లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos