ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి... పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కసరత్తులో భాగంగా... సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు మార్చడం... లేదా కొత్తవారిని సమన్వయకర్తలుగా నియమించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని రోజుల కిందటే 11మంది శాసనసభ్యులను ఇతర నియోజకవర్గాలకు మార్చేసిన విషయం తెలిసిందే. వీరిలోనూ చాలామందికి చివరి నిమిషంలో టికెట్లు ఇస్తారో లేదో అనే ఆందోళన నెలకొంది. తాజాగా మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను సీఎం జగన్ ఫైనల్ చేసినట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి ఆ ఫలితాల ఆధారంగా ఇన్ ఛార్జ్ లను మారుస్తున్నారు. మొత్తంగా 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. అసంతృప్త ఎమ్మెల్యేలకు సర్దిచెప్పే బాధ్యతను సీఎం జగన్ సన్నిహితుడు, వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి తీసుకున్నారు. తన తండ్రి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న రాయలసీమ, తాను ఇన్‌చార్జిగా ఉన్న గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలతో మిథున్ రెడ్డి మాటామంతీ కలిపారని... వారి హితబోధలకు ఎవరూ పెద్దగా స్పందించకపోవడంతో... ‘కూర్చుని మాట్లాడుకుందాం రండి’ అని ఆయన బెంగళూరులోని తన గెస్ట్‌హౌ్‌స్ కు ఆహ్వానించారని తెలుస్తోంది. ఆదివారం బెంగళూరులో ఈ భేటీ జరిగిందని... 42 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు హాజరయ్యారని... ఈ జాబితాలో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారని తెలుస్తోంది. కొన్ని రాజకీయ కారణాలు... ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఈసారి మీకు టికెట్ ఇవ్వడం లేదని... అంతకుమించి మరో కారణం లేదని... భవిష్యత్తులో మీకు తగిన అవకాశాలుంటాయని మిథున్ చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ.. ఏ ఒక్కరూ ఆ మాటలతో సంతృప్తి చెందలేదని... రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని ... మాకూ సొంతబలం ఉందని... రాటుదేలిన నాయకులను ఓడించి ఎమ్మెల్యేలయ్యామని ధ్వజమెత్తారని తెలుస్తోంది. తన స్థాయిలో ఎంతగా సర్దిచెప్పినా ఫలితం రాకపోవడంతో మిథున్ చేతులెత్తేశారని... పరిస్థితి తీవ్రతను జగన్‌కు చేరవేశారని అంటున్నారు. ఈ పరిణామంతో తాడేపల్లి శిబిరంలో వణుకు మొదలైందని... ఇక తానే నేరుగా ఎమ్మెల్యేలకు నచ్చజెప్పాలని జగన్ నిర్ణయించుకున్నా రని సమాచారం. ఇందులో భాగంగానే తాడేపల్లిలో సోమవారం భేటీకి జగన్ ఆహ్వానించారని... అయితే.. కేవలం ఏడెనిమిదిమంది శాసనసభ్యులు మాత్రమే జగన్ పిలుపునకు స్పందించి వచ్చారని సమాచారం. కాగా... బెంగళూరు భేటీకి హాజరైన వారు ‘వెళ్లిన మాట నిజమే’ అని అంగీకరిస్తూనే.. అయితే ఇతర పనులమీద వెళ్లినట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి రగిలిపోతున్నట్లు తెలిసింది. తిరుగుబాటును ఎందుకు గుర్తించలేకపోయారని ముఖ్య నేతలపై మండిపడినట్లు సమాచారం. మొత్తానికి వైసీపీలో చెలరేగింది టీకప్పులో తుఫాను అని ఆ పార్టీ నేతలు కొందరు లైట్ గా తీసుకున్నారని... కానీ సునామీ లాంటి పెద్ద ఉపద్రవమే ఆ పార్టీని ముంచెత్తుతోందని అధిష్టానం ఇప్పుడు గ్రహించిందని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos